Thursday, 20 February 2014

తెలుగు వికీపీడియాలో రికార్డు సృష్టిస్తున్న తెలంగాణ వ్యాసం


తేది 18-02-2014 నుంచి తెలుగు వికీపీడియాలో "తెలంగాణ" వ్యాసం అత్యధిక వీక్షణలతో రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు వికీపీడియాలోనే అత్యంత నాణ్యతతో, తగిన మూలాలతో, అవసరమైన చిత్రాలతో, తాజాకరణతో కూడి, నా స్వంత విజ్ఞాన సర్వస్వము మరియు అనేక వనరుల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందిన తెలంగాణ వ్యాసాన్ని చూడండి. మరింత సమాచారంకై, ఇంకొంత నాణ్యతకై సహకరించండి.

Sunday, 16 February 2014

తెవికీ కృషి ఎందరిది ?

తెలుగు వికీపీడీయా ఒక స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వము. అంటే ఎవరైనా ఉపయోగించుకోవడమే కాకుండా ఎవరైనా సమాచారం కూడా చేర్చగలిగేది అన్నమాట. అలాంటప్పుడు ఇంతవరకు జరిగిన తెవికీ కృషి అందరిది అనే భావన తప్పకుండా వస్తుంది. మరి అది సరైనాదేనా? అనే సందేహమూ రావచ్చు! ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం-

దిద్దుబాట్లు:
వ్యాస సమాచారంలో జరిగిన దిద్దుబాట్లను పరిశీలిస్తే డిసెంబరు అంతానికి 3.36 లక్షల దిద్దుబాట్లు జరిగాయి (బాటులు కాకుండా). వీటిలో 61% దిద్దుబాలు కేవలం 10 సభ్యులచే మాత్రమే జరిగింది. తెవికీలో సభ్యత్వం తీసుకున్న వారు 34000+ కాగా, కనీసం ఒక్క దిద్దుబాటైనా చేసిన వారు 3664, కనీసం 5 దిద్దుబాట్లు చేసినవారు 642 సభ్యులు మాత్రమే. 100+ దిద్దుబాట్లు చేస్నవారు 130 మాత్రమే. అంటే తెవికీలో చేరిన సభ్యులలో కృషిపరంగా చూస్తే అందులో చాలా కొద్దిమంది మాత్రమే దిద్దుబాట్లలో పాల్గొంటున్నారన్నమాట! అయితే కేవలం దిద్దుబాట్ల సంఖ్య ప్రకారమే ఈ కృషిని మనం బేరీజు వేయలేము. ఒక్క దిద్దుబాట్లు చేసే చోట పదుల సంఖ్యలో దిద్దుబాట్లు చేసిన వారున్నారు, అలాగే ఒక్క దిద్దుబాటుతో కూడా పెద్ద సమాచారం పెట్టినవారునారు. అలాగే దిద్దుబాట్ల ద్వారా వ్యాసానికి సంబంధం లేని సమాచారం, బాటుద్వారా చేర్చగలిగే సమాచారం పెట్టిన సభ్యుల దిదుబాట్లు కూడా గణాంకాలలో చేరాయి.

వ్యాస నాణ్యత:
తెవికీకి అతి ప్రధానమైనది వ్యాస నాణ్యత. చాలా సభ్యులు వ్యాస సమాచారానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నాణ్యతను గుర్తించడం లేదు. గత కొద్ది సంవత్సరాలలో తెవికీ వ్యాసాల నాణ్యత తగ్గడం వల్ల పాఠకుల ఆదరణ తగ్గిపోయింది! నాణ్యత అంటే వ్యాసంలోని వాక్యాల కూర్పు మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది వ్యాసానికి సంబంధించి పనికి వచ్చే సమాచారం, దానికి మూలాలు, పలు వనరుల నుంచి సేకరించిన సమాచారం మరియు ఎప్పటికప్పుడు తాజాకరణ. కాని చాలా వ్యాసాలు ఎప్పుడో వ్రాసినవి మళ్ళీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనితో వ్యాసాలలో తాజాకరణ ఉండటం లేదు. పాఠకులకు సమాచారం ఇవ్వకపోవడం కంటే తాజాకరణ లేని సమాచారం అందుబాటులోఉంచడమే పొరపాటు!

ఆ వ్యాసాలను ఎందరు చూస్తున్నారు?
కొందరు వ్రాసిన కొన్ని వ్యాసాలు చూస్తే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి వ్యాసాలు అవసరమేనా? అనే సందేహమూ వస్తుంది. ఇక్కడ ఎవరైనా, ఏ వ్యాసమైనా, తమకు నచ్చిన వ్యాసాన్ని వ్రాసుకోవచ్చు (నిబంధనలు ఉల్లంఘించనంతవరకు) కాని సంవత్సరాలైననూ ఒక్క వీక్షణ కూడా అలాంటి వ్యాసాలను సృష్టించడం వృధాగానే పరిగణించవలసి వస్తుంది! విశేషమేమంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వీక్షణలు లేని వ్యాసాలనే మళ్ళీమళీ కొందరిచేత సృష్టించడం జరుగుతోంది. గణాంకాల పరంగా దిద్దుబాట్లు సంఖ్య పెరగవచ్చు కాని ఇలాంటి వ్యాసాలవల్ల తెవికీ నాణ్యత మాత్రం పెరగదు.

దారిమార్పులు:
తెవికీలో దారిమార్పులే సుమారు 18000 వేలున్నాయి. అంటే ఆ సంఖ్య దిద్దుబాట్లు కూడా గణాంకాలలో చేరియున్నాయి. అందులో చాలా వరకు అనవసరమైనవే. కొన్ని వ్యాసాలకు పదుల సంఖ్యలో దారిమార్పులున్నాయి. విశేషవ్యాసమైతే ఫర్వాలేదు కాని వీక్షణలు లేని వ్యాసాలకు కూడా దారిమార్పులు ఉండటం వృధానే!

కాపి సమాచారం:
సాధారణంగా కాపి సమాచారం పరిమాణం పెద్దదిగానే ఉంటుంది. అది పత్రికల నుంచి కాపీ చేసినది కావచ్చు, అంతర్జాలంలో లభ్యమైన ఇతర వనరుల నుంచి కావచ్చు, చివరకు బ్లాగుల నుంచీ కావచ్చు కూడా. విశేషమేమంటే తెవికీ వ్యాసాల నుంచే కాపీచేసి సృష్టించిన అతిపెద్ద వ్యాసాలూ మనవద్ద ఉన్నాయి! (దీన్ని వ్యాసాల సంకలనం అనాలేమో!) కొందరు సీనియర్ సభ్యులకు కూడా ఇలాంతి విషయాలపై అవగాహన లేదు!


Monday, 3 February 2014

జనవరి 2014 మాసంలో తెవికీలో తెలంగాణ ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ

జనవరి 2014 మాసంలో తెవికీలో తెలంగాణ ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ

  • జనవరి 11, 2014న ప్రారంభమైన తెలంగాణ ప్రాజెక్టు మాసాంతానికి అంటే 20 రోజులలో 26 వ్యాసాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇందులో 22 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి, 2 కోటలకు, 2 రైల్వేస్టేషన్లకు సంబంధించినవి.
  • జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాకు చెందిన 7 వ్యాసాలు, మహబూబ్‌నగర్ జిల్లా, హైదరాబాదు జిల్లా మరియు ఆదిలాబాదు జిల్లాకు చెందిన వ్యాసాలు 4 చొప్పున, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాకు చెందిన వ్యాసాలు 3 చొప్పున, నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక వ్యాసం కొత్తగా ప్రాజెక్టు పరిధిలో చేరాయి. రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒక్క వ్యాసంకూడా కొత్తగా చేరలేదు.
  • సభ్యులవారీగా పరిశీలిస్తే అత్యధికంగా ప్రణయ్‌రాజ్ 9 వ్యాసాలను సృష్టించగా, నేను (సి.చంద్రకాంతరావు) 7 వ్యాసాలను, నాయుడిగారి జయన్న 3 వ్యాసాలు, వైజాసత్య 2 వ్యాసాలు, భాస్కరనాయుడు 2 వ్యాసాలు, వెంకటరమణ, రహంతుల్లా, ఈగల్ ఒక్కో వ్యాసాన్ని సృష్టించారు.
  • 26 వ్యాసాలలో 19 వ్యాసాలు ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 7 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కాని వారిచే సృష్టించబడ్డాయి

Saturday, 1 February 2014

జనవరి 2014లో తెవికీలో ఎలాంటి వ్యాసాలు వచ్చాయి?

జనవరి 2014 మాసంలో తెలుగు వికీపీడియాలో సుమారు 500 వ్యాసాలు కొత్తగా చేరాయి. సంఖ్య బాగుగ్నే కనిపిస్తున్ననూ ఇందులో నాణ్యమైన వ్యాసాలు కొద్దిమాత్రమే ఉన్నాయి. ప్రతిమాసం వచ్చినట్లు కాపీ వ్యాసాలు, తెవికీ నాణ్యతకు సరిపడని వ్యాసాలు ఎక్కువ సంఖ్యలోనే సృష్టించబడ్డాయి. వ్యక్తుల వ్యాసాలు అధికంగానే చేరిననూ వీటిలో చాలా వ్యాసాలు చిన్న వ్యాసాలే. లోకసభ సభ్యులకు సంబంధించిన వ్యాసాలు కూడా అధిక సంఖ్యలో చేరాయి.

మొత్తంపై జనవరి 2014లో వచ్చిన వ్యాసాలలో ముఖ్యమైనవి : భాగ్యరెడ్డివర్మ , యెండెల లక్ష్మీనారాయణ, అలిశెట్టి ప్రభాకర్, చెన్నమనేని హన్మంతరావు, రావాడ సత్యనారాయణ, మాదరి భాగ్య గౌతం, ‎కడియం శ్రీహరి, ‎కిషోర్ చంద్ర దేవ్, బద్దం బాల్‌రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, రమేష్ రాథోడ్, బద్దం నరసింహారెడ్డి, జి.నరసింహారెడ్డి, అంజుమ్‌ చోప్రా, ‎ఎస్.టి.జ్ఞానానంద కవి, సి.మాధవరెడ్డి, బోళ్ళ బుల్లిరామయ్య, బీరం మస్తాన్‌రావు, చెన్నమనేని రాజేశ్వరరావు.

ఫిబ్రవరి మాసంలోనైననూ సభ్యులు నాణ్యతతో కూడిన వ్యాసాలు సృష్టిస్తారని ఆశిద్దాం.