Saturday 30 November 2013

తెవికీలో వ్యాసాల వృద్ధి పరిణామం

పదేళ్ళ క్రితం ప్రారంభమైన తెలుగు వికీపీడియాలో దాదాపు ఎనిమిది మాసాల పాటు ఒకే ఒక్క వ్యాసాన్ని కలిగియుంది. ఆ తర్వాత మెల్లగా వ్యాసాలసంఖ్య వృద్ధి చెందుతూ ఒక సంవత్సరం పూర్తయ్యే నాటికి (12/2004) వ్యాసాల సంఖ్య 43కు చేరింది. ఆ తర్వాత వ్యాసాల వృద్ధి వేగంగా పెరిగి రెండో ఏడాది ముగిసే నాటికి (12/2005) 1700 వరకు చేరింది. చావాకిరణ్, వీవెన్, వేమూరి, వైజాసత్య, చదువరి, ప్రదీప్, త్రివిక్రంల చేరికతో వ్యాసాల సంఖ్యలో కదలిక వచ్చి విశేష పురోభివృద్ధి కనిపించింది. మూడో ఏడాదిలో గ్రామవ్యాసాలను సృష్టించడంతో 12/2006 నాటికి వ్యాసాల సంఖ్య 26వేలకు చేరింది. కాసుబాబు, సుజాత, రహమతుల్లా, చిట్టెల, నవీన్‌ల చేరిక ఇదే కాలంలో జరిగింది. రాజశేఖర్, అహ్మద్ నిసార్, రవిచంద్ర, అర్జునరావు, మాటలబాబు, దేవా, విశ్వనాథ్, చంద్రకాంతరావుల చేరికతో 12/2007 నాటికి 38వేలు, 12/2008 నాటికి 42 వేలకు చేరింది. 2/2008లో ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో కవర్ స్టోరి రావడంతో ఈ కాలంలో వేలాది కొత్త సభ్యులు చేరారు. 12/2009 నాటికి 44వేలకు చేరగా ఈ కాలంలో కొత్తగా చేరిన వారిలో సుల్తాన్ ఖాదర్, వీరా ముఖ్యులు. 12/2010 నాటికి 47 వేలకు చేరింది ఈ కాలంలోనే జెవిఆర్‌కె ప్రసాద్ చేరారు. 12/2011 నాటికి 50వేలకు చేరింది. 12/2012 నాటికి కొంత మాత్రమే మెరుగై వ్యాసాల సంఖ్య 51వేలకు చేరింది. ఈ కాలంలో భాస్కరనాయుడు, వైవిఎస్ రెడ్డి, పాలగిరి, రహ్మానుద్దీన్, శ్రీధర్, వెంకటరమణ, శ్రీరామమూర్తి సభ్యులు నూతనంగా తెవికీలో ప్రవేశించారు. వీరందరి కృషి ఫలితంగా నేటికి (11/2013) సుమారు 53800 వ్యాసాలున్నాయి. ఒకప్పుడు దేశభాషా వికీలలో అత్యధిక వ్యాసాలు కలిగిన తెవికీని తదనంతరం హిందీ, తమిళ వికీలు అధికమించాయి. మళ్ళీ మనం ఆ స్థానాన్ని పొందడం కొంత కష్టమే కాని సభ్యులు ప్రయత్నిస్తే అసంభవం మాత్రం కాదు. 

ఎవరెన్ని సృష్టించారు?
వ్యాసాలను సృష్టించడంలో బాటులే అగ్రస్థానంలో ఉన్నాయి. వైజాసత్యగారి Vyzbot ద్వారా 24 వేల వ్యాసాలు, ప్రదీప్ గారి Mpradeepbot ద్వారా 5700 వ్యాసాలు సృష్టించబడ్డాయి. అంటే తెవికీలోని మొత్తం వ్యాసాలలో సగభాగం కంటే అధికంగా ఈ రెండు బాటులు సృష్టించిన వ్యాసాలే అన్నమాట.

ఏ వ్యాసాలు ఎన్ని?
తెవికీ వ్యాసాలలో అగ్రస్థానం గ్రామవ్యాసాలే అనే సంగతి అందరికీ తెలుసు. దాదాపున్ 26 వేల గ్రామవ్యాసాలు తెవికీలో ఉన్నాయి. వీటిలో అధికశాతం ఏకవాక్య వ్యాసాలే. అయితే ఇటీవలి కాలంలో గ్రామవ్యాసాలలో కూడా సమాచారం చేరుతోంది. గ్రామవ్యాసాల తర్వాత రెండోస్థానం సినిమా వ్యాసాలది. ఇవి 5-6 వేల సంఖ్యలో ఉండవచ్చు. కేలండర్ వ్యాసాలు (సంవత్సరాలు, తేదీలు), వ్యక్తుల వ్యాసాలు, దేశాలు, నియోజకవర్గాలు, శాస్త్ర-సాంకేతికాల వ్యాసాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి.

Friday 22 November 2013

అక్టోబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు

అక్టోబరు 2013 మాసపు తెవికీగణాంకాలు విడుదలైనాయి. గణాంకాలను విశ్లేషిస్తే ఈ మాసంలో కొత్తగా 6గురు (5+ ఎడిట్లు చేసిన) సభ్యులు తెవికీలో చేరారు. దీనితో మొత్తం సభ్యుల సంఖ్య 605కి చేరింది. 5కు పైగా దిద్దుబాట్లు చేసినవారి సంఖ్య ఈ మాసంలో 40గా నమోదైనది. అలాగే  15 సభ్యులు 100+ దిద్దుబాట్లు చేశారు. ఫిబ్రవరి 2008లో నమోదైన 16 తర్వాత ఈ సంఖ్య తెవికీ చరిత్రలోనే రెండో అత్యధికంగా చెప్పవచ్చు. 1000+ దిద్దుబాట్లు చేసిన వారి సంఖ్య గత మాసపు 3 కంటె దిగజారి 2కి చేరిననూ 2500+ దిద్దుబాట్లు విషయంలో వరసగా రెండో మాసం కూడా ఒక సంఖ్య నమోదైంది.

ఎవరెన్ని దిద్దుబాట్లు చేశారు:
10/2013 మాసంలో సభ్యుల వారీగా పరిశీలిస్తే దిద్దుబాట్ల సంఖ్యలో YVSREDDY 3572 దిద్దుబాట్లతో (వ్యాసపు దిద్దుబాట్లు మాత్రమే) ప్రథమస్థానంలో ఉండగా, శ్రీరామమూర్తి 1884 దిద్దుబాట్లతో రెండోస్థానంలోనూ, ఆ తర్వాత Kvr.lohith (724), Palagiri (938), Rajasekhar1961 (621), C.Chandra Kanth Rao (551), Bhaskaranaidu (477), T.sujatha (334), Veera.sj (282), Rotlink (226), అహ్మద్ నిసార్ (190), సుల్తాన్ ఖాదర్ (139), Pranayraj1985 (130), విశ్వనాధ్.బి.కె. (115), Kprsastry (110), Svgvenuvu (105) 3 నుంచి 16 స్థానాలలో ఉన్నారు. మొత్తం వ్యాసపు దిద్దుబాట్ల సంఖ్యలో YVSREDDY మరియు శ్రీరామమూర్తి కలిసి సగభాగంపైగా వాటా కలిగియున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.




వ్యాసేతర దిద్దుబాట్లలో Arjunaraoc (1546) ప్రథమస్థానంలో ఉండగా, YVSREDDY (1243) రెండోస్థానంలోనూ, Kvr.lohith (869), C.Chandra Kanth Rao (253), Palagiri (180), Rajasekhar1961 (178),Veera.sj (164), రహ్మానుద్దీన్ (151), Kprsastry (145) తర్వాతి స్థానాలలో ఉన్నారు.

కొత్తవ్యాసాలు సృష్టించిన వారిలో YVSREDDY (43) తొలి స్థానం, Rajasekhar1961 (32) రెండోస్థానంలో, Bhaskaranaidu (25), Kvr.lohith (14), శ్రీరామమూర్తి (12), సుల్తాన్ ఖాదర్ (11) తర్వాతి స్థానాలలో ఉన్నారు.

రికార్డులు:
  • సభ్యుడు:YVSREDDYచే అక్టోబరు 2013 మాసంలో జరిగిన 3572 దిద్దుబాట్ల సంఖ్య (వ్యాసం పేజీలలో) ఒకే మాసంలో ఒక సభ్యునిచే జరిగిన అత్యధిక దిద్దుబాట్ల రికార్డుగా నమోదైనది. 
  • వ్యాసం పేజీలలో 100కు పైగా దిద్దుబాట్లు ఈ మాసంలో 15 సభ్యులు చేశారు. ఈ విషయంలో ఇది తెవికీ చరిత్రలో రెండో అత్యధికం.

 గమనిక: దిద్దుబాట్ల సంఖ్యకు తెవికీ నాణ్యతకు ఎలాంటి సంబంధం లేదు.

ఇవి కూడా చూడండి:

Monday 18 November 2013

తెవికీలో ఉపపేజీలు - అవగాహన

పేజీకి అనుబంధంగా ఉండే పేజీలనే ఉపపేజీలంటారు. ఆ పేజీలు సభ్యుల వాడుకరి పేజీలు కావచ్చు, చర్చాపేజీలు కావచ్చు, వ్యాసం పేజీలుకావచ్చు. అయితే ఈ ఉపపేజీల యొక్క అవసరం ఏమిటి? వాటిని ఎలా సృష్టించాలి? దిద్దుబాట్లలో ఆపేజీలపై ఉన్న పరిమితులేమిటి? తదితర విషయాలను తెలుసుకుందాం.

ఉపపేజీలు సృష్టించుట:
ఉప-పేజీలనేవి పేజీకి అనుబంధంగానే ఉంటాయి కాబట్టి ప్రధానపేజీ పేరు తర్వాత స్లాష్ (/) ఇచ్చి తర్వాత ఏదేని పేరు వ్రాసి వ్యాసం సృష్టించే తరహాలోనే దీన్ని కూడా సృష్టించవచ్చు. ఉదా:కు xyz అనే సభ్యుడు తన వాడుకరి పేజీ (సభ్యపేజీ)కి అనుబంధంగా ప్రయోగాలు చేయడానికి ఒక ప్రయోగశాలను ఏర్పాటుచేసుకోదలిస్తే "వాడుకరి:xyz/ప్రయోగశాల" పేరుతో పేజీ సృష్టిస్తే అది ఆ వాడుకరి పేజీ యొక్క ఉప పేజీ అవుతుంది.

ఉపపేజీల అవసరం ఏమిటి?
  • తెవికీలో ప్రయోగశాల ఉంది కదా! మరి ప్రత్యేకంగా ఒక సభ్యునికి ప్రయోగశాల ఎందుకనే అనుమానం రావచ్చు. కాని తెవికీ ప్రయోగశాలలో ఎవరైనా ప్రయోగాలు చేయవచ్చు. ఒకరి కంటె అధికంగా ఒకే సారి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకరి ప్రయోగం మరొకరికి ఆటంకం కలుగుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే చాలా సభ్యులు తమ సభ్యపేజీలకు అనుబంధంగా ఉపపేజీలను సృష్టించి ప్రయోగశాలగా వాడుకుంటారు.
  • తమ సభ్యపేజీకి అనుబంధంగా ఏదేని వ్రాయదల్చుకుంటే దానికై కూడాఉపపేజీలు సృష్టించుకోవచ్చు.
  • రచ్చబండలలో తరుచుగా చర్చలు జరుగుతూంటాయి కాబటి ఆ పేజీ చాలాపొడవు అవుతుంది. కొంతకాలం తర్వాత పాతచర్చలు ఉపపేజీలకు తరలిస్తారు. ఈరోజు నాటికి (18-11-2013) రచ్చబండకే 25 ఉపపేజీలున్నాయి చూడండి.
  • వ్యాసం లేదా సభ్యుల చర్చాపేజీలలో కూడా చర్చలు ఎక్కువై ఆపేజీ పొడవు పెరిగినప్పుడు వాటిని కూడా ఉపపేజీలకు తరలించవచ్చు.
  • కొందరు సభ్యులు కొత్త వ్యాసం ప్రారంభించేటప్పుడు ఇతర సభ్యులు ఆ వ్యాసంలో తాత్కాలికంగా జోక్యం చేసుకోరాదని తమ సభ్యపేజీకి అనుబంధంగా ఉపపేజీలు ప్రారంభిస్తారు.
  • వికీ ప్రాజెక్టులకు అనుబంధంగా కూడా ఉపపేజీలు సృష్టించబడతాయి.

ఉపపేజీలను ఎలా తొలగించాలి?
వ్యాసాన్ని తొలిగించినట్లే ఉప పేజీలకు కూడా తొలగించవచ్చు. ప్రయోగశాల వంటివి భవిషత్తులోకూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని అలాగే ఉంచుకోవడం మంచిది. కొత్త వ్యాసం కొరకు సృష్టించిన ఉపపేజీలలో సమాచారం ఒకస్థాయికి వచ్చిన పిదప కాపీపేస్ట్ చేయడం కంటె తరలించడం సరైనపని. కాపీపేస్టే చేయడం వల్ల కూర్పుల చరితం వ్యాసంలోకి చేరదు. కాబట్టి తరలించి దారిమార్పుగా ఏర్పడిన ఉపపేజీలో మళ్ళీ పనులు సాగించవచ్చు.

ఉపపేజీలకు లింకులు ఎలా ఇవ్వాలి?
ఉపపేజీలకు లింకులివ్వడానికి మొత్తం పేరుతోనే కాకుండా మరో చిన్నదారికూడాఉంది. అదే స్లాష్ (/) తర్వాత ఆ ఉపపేజీ ఇస్తే సరిపోతుంది. (ఉదా:కు వాడుకరి:abc సభ్యపేజీకి ఉపపేజీ అయిన ప్రయోగశాల లింకుకై [[[/ప్రయోగశాల]] అనిమాత్రం ఇస్తే సరిపోతుంది) అయితే ఈ సదుపాయం ఆ ప్రధాన పేజీకే పరిమితం. ఇతర పేజీలలో మాత్రం మొత్తం పేరుతోనే లింకులివ్వాల్సి ఉంటుంది.

ఉపపేజీలపై పరిమితులు:
  • ఉపపేజీలలో కూడా తెవికీ నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయరాదు.
  • ఒకే పేజీకి మితిమీరి ఉప పేజీలు సృష్టించకండి.
  • వ్యాసాలకు ఉపపేజీలు సృష్టించకండి, మరో ప్రత్యేక వ్యాసాన్నే తయారుచేయండి. ఉదా:కు "xyz" నటుడి పేజి ఉందనుకుందాం, ఆ నటుకి సంబంధించిన సినిమా పేర్లతో (అధికంగా ఉంటేనే) మరో వ్యాసాన్ని ("xyz నటించిన సినిమాలు") తయారుచేయండి కాని "xyz/సినిమాలు" అని ఉపపేజీ పెట్టకండి.
  • ఒకరు సృష్టించుకున్న ఉపపేజీలలో మరొకరు సాధారణంగా జోక్యం చేసుకోకపోవడం మంచిది. అందులోని విషయంపై ఏదేని చెప్పదలిస్తే ఆ సభ్యుని చర్చాపేజీలో తెలపండి.
  • ఉపపేజీలకు కూడా ఉపపేజీలు సృష్టించవచ్చు, కాని అలా ఉప-ఉప-ఉపపేజీలు సృష్టించి గందరగోళం చేయకండి. 
  • రచ్చబండ ఉపపేజీలైనా, చర్చాపేజీ ఉపపేజీలైనా అవి పాత చర్చలకు సంబంధించినవి కాబట్టి అందులో మార్పు చేయకండి.అవసరమైతే అదే విషయంపై మరో కొత్త చర్చ తీయండి.

Saturday 16 November 2013

తెవికీలో గ్రామ వ్యాసాలు - పరిశీలన

తెలుగు వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు చెందిన రెవెన్యూ గ్రామాలను ఆగస్టు నుంచి అక్టోబరు 2006 వరకు బాటుద్వారా 28వేలకు పైగా పేజీలు బాటుద్వారా సృష్టించబడ్డాయి. త్వరలోనే ఈ గ్రామావ్యాసాలు వృద్ధిచెందుతాయని, పాఠకులకు ఉపయోగపడుతుందని భావించబడిననూ ఏడేళ్ళు గడిచిననూ చాలా గ్రామ వ్యాసాలు ఇంకనూ ఒకేఒక్క వాక్యంతో ఉన్నాయి.

గ్రామవ్యాసాలను వృద్ధిచేయడానికి అపారమైన అవకాశాలున్ననూ సభ్యులు చొరవ తీసుకోవడానికి కారణం తెలియడం లేదు. ప్రతి జిల్లాకు చెందిన గ్రామవ్యాసాలను ఒక్కో సభ్యుడు దత్తత తీసుకుంటే కొన్ని మాసాలలోనే గ్రామవ్యాసాలలో సమాచారం ఖచ్చితంగా ఒకస్థాయికి చేరుతుంది. గ్రామంలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు, గ్రామ జనాభా, పంచాయతి వివరాలు, పంటలు తదితర సమాచారం ఆయా జిల్లా కార్యాలయాలలో లభ్యమౌతుంది. ప్రతి మండలానికి చెందిన మండల దర్శిని పుస్తకాలు కూడా జిల్లా కేంద్రం నుంచి తీసుకొని గ్రామవ్యాసాలను వృద్ధిచేసే అవకాశం ఉంది.

గ్రామవ్యాసాలు అభివృద్ధి చెందితే తెలుగు వికీపీడియాకు మంచిపేరు రావడమే కాకుండా పాఠకులకు కూడా ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. వీటి వల్ల వీక్షకుల సంఖ్య కూడా వేగంగా విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతమున్న ఒక్క వాక్యాన్ని చూడడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు కాని గ్రామ వ్యాసాలలో తగినంత సమాచారం ఉన్నచో తప్పనిసరిగా అంతర్జాలంతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరు తమ లేదాతమకు తెలిసిన గ్రామాలను దర్శించడానికి ఉత్సుకత చూపుతారని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో శ్రీరామమూర్తి గారు పశ్చిమగోదావరి, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన గ్రామవ్యాసాలలో జనాభా వివరాలు చేర్చుతున్నారు. అలాగే నేను (సి.చంద్రకాంతరావు) రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చాను/చేర్చుతున్నాను. కనీసం ఒక్కో సభ్యుడు రోజూ ఒక్కమండలం పూర్తి చేసినా రెండు మాసాలలోపే జిల్లాలోని అన్ని గ్రామవ్యాసాలు అభివృద్ధి చెందుతాయి.

Wednesday 13 November 2013

తెవికీలో నియోజకవర్గాల వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలకు చెందిన అన్ని 294 వ్యాసాలు తెలుగు వికీపీడియాలో రూపుదిద్దుకుంటున్నాయి. 2009 ఎన్నికలకు ముందు నుంచే తెలుగు వికీపీడియాలో నియోజకవర్గాల వ్యాసాలు ప్రారంభమయ్యాయి. 2009 ఎన్నికల వరకు మహబూబ్‌నగర్, ఆదిలాబాదు మరియు రంగారెడ్డి జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాసాలలో సమాచారం ఒక స్థాయికి వచ్చింది. మిగితా జిల్లాల నియోజకవర్గాల వ్యాసాలలో సమాచారం మామూలు స్థాయిలోనే ఉంది. నియోజకవర్గ వ్యాసాలలో ఉన్న అందమైన పటాల తయారీకి అప్పట్లో దేవా అనే సభ్యుడు చాలా కృషిచేశారు.

నియోజకవర్గ వ్యాసాలలో సమాచారాన్ని ఎవరైనా చేర్చి వ్యాసాలను పొడగించవచ్చు. ప్రస్తుతం ఉన్న వ్యాసాలను చూడడానికి దర్శిచండి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు.

Friday 8 November 2013

తెలుగు వికీపీడియా వ్యాసాలలో లింకులు - విధానాలు

వ్యాసాలను చదువుతున్నప్పుడు గ్రంథాలలో లేని సదుపాయం అంతర్జాలంలో ( ఆఫ్ లైన్ కంప్యూటర్‌లో కూడా) చాలా ఉంటుంది. ఇందులో ఒకటి లింకులు. తెలుగు విజ్ఞానసర్వస్వపు వ్యాసాలు పఠిస్తున్నప్పుడు కూడా చాలా లింకులు కనిపిస్తాయి. సందేహం కొరకు ఆ లింకులపై నొక్కితే సంబంధిత వ్యాసాలను చేరుకుంటాము. మరి ఆ లింకులు ఎలా ఇవ్వాలి? దాని విధి-విధానాలేమిటి తెలుసుకుందాం.

లింకులు ఎలా ఇవ్వాలి?
తెవికీలో లింకులు ఇవ్వడం చాలా తేలిక. ఏదేని పదానికి [[  ]] బ్రాకెట్లు తగిలిస్తే చాలు ఆటోమేటిగ్గా లింకు ఏర్పడుతుంది. అయితే ఆ పదం (లేదా పదాలు) పై ఇదివరకే వ్యాసం ఉంటే లింకు నీలిరంగులోనూ, వ్యాసం లేకుంటే ఎర్రరంగులోనూ కనిపిస్తుంది. ఏదేని వ్యాసంలో సవరించి ట్యాబ్ నొక్కి మీరు ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

పదానికి సరిపడ వ్యాసం లేనప్పుడు లింకు ఎలా ఇవ్వాలి?

వ్యాసంలో ఉన్న చాలాపదాలకు అదే పదాలతో వ్యాసాలుండవు. ఉదా:కు అశోకుని పాలనా కాలం.... వాక్యంలో "అశోకుని" పదానికి పైన తెలిపినట్లు లింకిస్తే ఎర్రలింకు ఏర్పడుతుంది. ఎందుకంటే "అశోకుని" అనే పేరుతో వ్యాసం ఉండదు. అలాంటప్పుడు దాన్ని అశోకుడు వ్యాసానికి లింకును ఎలా ఇవ్వాలి? అనే సందేహం రావచ్చు. ఇది కూడా చాలా తేలికే. అయితే బ్రాకెట్లో మధ్యలో పైపు (|) ఉంచి పైపుకు ఎడమ వైపున మాత్రం అసలైన వ్యాసం పేరు ఇవ్వాలి. ఉదా:కు [[అశోకుడు|అశోకుని]] లింకు ఇస్తే వాక్యంలో అశోకుని అనే కనిపించిననూ లింకుమాత్రం అశోకుడు వ్యాసానికి దారితీస్తుంది.

వ్యాసంలో ఒక విభాగానికి లింకు ఇవ్వడం:
వ్యాసాలు పెద్దవిగా ఉన్నప్పుడు సౌలభ్యం దృష్ట్యా వ్యాసానికి కాకుండా వ్యాసంలోని ఒక విభాగానికి కూడా లింకు ఇవ్వవచ్చు. అలా ఇవ్వాలంటే వ్యాసం పేరు తర్వాత # పెట్టి విభాగం పేరు వ్రాయాలి. ఉదా:కు తెలంగాణ వ్యాసం పెద్దది కాబట్టి ఆ వ్యాసంలో తెలంగాణ సాహిత్యం విభాగానికి లింకుని ఇవ్వాలంటే [[తెలంగాణ#తెలంగాణ సాహిత్యం]] అని పెడితే ఆ విభాగానికి దారిఏర్పరుస్తుంది.

వ్యాసంలో లింకులు - పరిమితులు:
  • వ్యాసంలో లింకులు ఇవ్వడం వల్ల పాఠకులకు సౌలభ్యం ఉన్ననూ పరిమితి దాటితే వాటివల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఇటీవల కాలంలో చాలామంది టచ్‌స్క్రీన్ వాడుతున్నారు. లింకుపై కొద్దిగా టచ్ అయినా కొత్తవ్యాసం వస్తుంది. మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అధిక లింకుల వల్ల దిద్దుబాటు చేసే సభ్యులకు కూడా (ముఖ్యంగా కొత్త సభ్యులకు) గందరగోళంగా మారుతుంది.
  • అలాగే ఒకే పదం వ్యాసంలో పలుమార్లు వచ్చియుంటే ప్రతీసారి ఆ పదానికి లింకు ఇచ్చే అవసరం ఉండదు. మరీ పొడవైన వ్యాసాలలో మాత్రం దీనికి కొంత మినహాయింపు ఇవ్వవచ్చు.
  • తేదీలకు మాసంతో కలిపి లింకులు ఇవ్వాలి. ఉదా:కు "ఆగస్టు 15" ను రెండు పదాలు విడివిడిగా కాకుండా [[ఆగస్టు 15]]గా లింకిస్తే  ఆ తేదీకి సంబంధించిన వ్యాసాన్ని చేరుకోవచ్చు, లేనిచో ఆగస్టు మాసపు వ్యాసం, 15 అంకె వ్యాసంలకు లింకులు దారితీస్తాయి. అయితే సంవత్సరంకు మాత్రం విడిగా లింకులివ్వాలి.
  • లింకులు ఇచ్చేముందు వ్యాసం ఏ పేరుతో ఉన్నదో గ్రహించండి. వ్యాసం పేరు ఇవ్వడంలో కొద్దిగా తేడా వచ్చినా ఎర్రలింకు ఏర్పడుతుంది. దీనిపై వ్యాసం లేదని భావించి ఎవరైనా మరో కొత్త వ్యాసం సృష్టించవచ్చు కూడా. వారి శ్రమ వృధాకావచ్చు.


ఇలాగే వర్గాలకూ, బొమ్మలకూ, ఇతర భాషావికీలలోని వ్యాసాలకు కూడా లింకులివ్వవచ్చు. వికీకి సంబంధంలేని ఇతర వెబ్‌సైట్లకు లింకులివ్వడంలో మాత్రం కొంత తేడా ఉంటుంది. వీటన్నింటినీ మరోపాఠంలో నేర్చుకుందాం.

Wednesday 6 November 2013

తెలుగు వికీపీడియాను ఎందరు చూస్తున్నారు?

వందలాది సభ్యుల కృషితో రూపుదిద్దుకుంటున్న తెలుగువికీపీడియాను ఎందరు వీక్షకులు చూస్తున్నారు? ఈవిషయంలో దేశ భాషా వికీలలో తెవికీ స్థానం ఏది? తదితర విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెవికీలో సభ్యులు కృషిచేసేది తమకోసం కాదు, పాఠకులకోసమే అన్నది తెలిసిందే. అలాంటప్పుడు పాఠకులు ఏయే వ్యాసాలను ఆదరిస్తున్నారో తెలుసుకొని సభ్యులు అలాంటి వ్యాసాలపై అధికకృషి చేసినప్పుడే సభ్యుల కృషికి సార్థకత లభిస్తుంది.

తెవికీని ఎందరు చూస్తున్నారు?
సెప్టెంబరు 2013 నాటి తాజా గణాంకాల ప్రకారం చెప్పాలంటే తెలుగు వికీపీడీయాను ప్రపంచం మొత్తంపై ప్రతి గంటకు సరాసరిన 3635 వీక్షణలు వస్తున్నాయి. అంటే నిమిషానికి 60, సెకనుకు ఒక వీక్షణ జరుగుందన్నమాట. అయితే ఈ వీక్షణలు తెవికీలో వ్యాసాలు రచించే సభ్యులు, ఇతర భాషా వికీ సభ్యులు లింకుల ద్వారా ఇక్కడికి వచ్చే సందర్శనలు కూడా ఇందులో కలుస్తాయి. అయితే ఈ వీక్షణ సంఖ్య చాలా తక్కువేనని చెప్పవచ్చు.

ఇతర భాషా వికీలతో తారతమ్యం:
మనతో దాదాపు సమానంగా 8 కోట్ల ప్రజలున్న వియత్నామీస్ భాషా వికీకి మనకంటె 38 రెట్లకు పైగా అంటే గంటకు 13021 (సెకనుకు 38) వీక్షణలు వస్తున్నాయి. భారతీయ భాషలలో హిందీవికీకి గంటకు 15369 వీక్షణలు జరుగుతున్ననూ (మనకంటే 4.2 రెట్లు) ఆ భాష మాట్లాడేవారు కూడా మనకంటే 6.8 రెట్లు అధికంగా ఉన్నారు. బెంగాలీ వికీ పరిస్థితి కూడా ఇదే. మరాఠి మాష మాట్లాడే వారు మనకంటె కొద్దిగా అధిక సంఖ్యలో ఉన్ననూ వీక్షకులు మనకంటే 1.7 రెట్లు అధికంగా ఉన్నారు. తమిళభాష మాట్లాడేవారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్ననూ వీక్షకుల సంఖ్య  గంటకు10216 (మనకంటె 2.8 రెట్లు) వీక్షణలు వస్తున్నాయి. కన్నడ, గుజరాతి వికీల కంటే మాత్రం మన వీక్షకులు ఎక్కువే. కేవలం 10 లక్షల ప్రజలుమాత్రమే మాట్లాడే ఎస్పరాంటో భాషావికీకి గంటకు 14,339 వీక్షకులు ఉన్నారంటే ఆశ్చర్యకరం కాదు కాని మనం ఇంకనూ కృషిచేయాల్సింది, పాఠకులను ఆకట్టుకోవాల్సింది చాలా ఉంది అని గ్రహించాల్సిన విషయం.

మాసాల వారీగా వీక్షణల పరిస్థితి:
దాదాపు ప్రతి మాసంలో 2-3 మిలియన్లు ఉండే వీక్షకుల సంఖ్య అక్టోబరు మాసంలో 3 దాటడం శుభసూచకం. సరిగ్గా రెండేళ్ళ తర్వాత 3 మిలియన్లు దాటిననూ అప్పటి 3.5 మిలియన్ల రికార్డును అధికమించలేదు. ఫిబ్రవరి 2010లో ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో తెలుగు వికీపీడీయాపై కవర్ పేజీ కథనం రావడంతో ఆ నెలలో జరిగిన 4.5 మిలియన్ల ఆల్‌టైం వీక్షకుల సంఖ్య రికార్డు మాత్రం పదిలంగానే ఉంది.

పాఠకులు ఎలాంటి వ్యాసాలు చూస్తునారు?
ఏప్రిల్ 2013 నాటి గణాంకాల ప్రకారం పరిశీలిస్తే మొదటి పేజీకి 33638 వీక్షణలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాలలో ఇటీవలి మార్పులు, ఉగాది ఉన్నాయి. నిర్వహణ పేజీలు వదిలిపెట్టి చూస్తే తెలుగు (7వస్థానం), బీ.ఆర్.అంబేడ్కర్ (11వ స్థానం), మహాత్మాగాంధీ (12వ స్థానం), శ్రీశైలం (14వస్థాన), తెలుగు భాష చరిత్ర (21వ స్థానం), నన్నయ్య (22వ స్థానం), భారత దేశము (23వ స్థానం), ఆంధ్ర ప్రదేశ్ (24వ స్థానం), శ్రీశ్రీ (28వ స్థానం), గురజాడ అప్పారావు (31వ స్థానం), శ్రీ కృష్ణదేవ రాయలు (32వ స్థానం), నందమూరి తారక రామారావు (33), శ్రీరామనవమి (35), జగ్జీవన్ రాం (36), సంక్రాంతి (37), రావూరి భరద్వాజ (38), తిక్కన (39), స్వామీ వివేకానంద (40), మహా భారతము (42), భారత రాజ్యాంగం (43), చిరంజీవి (45), భారతదేశ చరిత్ర (46), భగవద్గీత (47), సుభాష్ చంద్రబోస్ (48) స్థానాలలో ఉన్నాయి. దీని బట్టి చూస్తే వ్యక్తుల వ్యాసాలను పాఠకులు అధికంగా వీక్షుస్తున్నారని విశదమౌతోంది. ఇలాంటి వ్యాసాలపై మరింత కృషిచేసి ఉన్న వ్యాసాలను పొడగించడం, తాజాకరణ చేయడం, నాణ్యత పెంచడం మరియు కొత్తగా పేరుపొందిన వ్యక్తుల వ్యాసాలు చేరిస్తే పాఠకులు తెవికీని మరింతగా ఆదరిస్తారని అనుకోవచ్చు.

Monday 4 November 2013

వికీకోట్‌లో ఏముంటుంది?

తెలుగు వికీకోట్
వికీపీడీయా పేరు అందరికీ సుపరిచితమే. అది ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వపు భాండాగారమని కూడా అందరికీ తెలుసు. వికీపీడియాకు అనుబంధంగా ఎన్నో ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి వికీకోట్. ఇందులో తొలిసగం పేరు వికీ అంటే ఎవరైనా ఉపయోగించుకొనే అర్థాన్ని సూచిస్తే, మలి సగం పేరు కొటేషన్లను సూచిస్తుంది. అంటే ఇది ఉచిత కొటేషన్ల భాండాగారమని అర్థం చేసుకోవచ్చు. ("ఉచిత సలహా" మాదిరిగా అర్థం చేసుకోకండి). వికీపీడియాలో ఉన్నట్లుగా ఇందులోనూ ప్రతిపేజీలో లింకులు, బయటి లింకులు, మూసలు, అంతర్వికీలు ఉంటాయి. అయితే ఇది కేవలం 56 భాషలలోనే నిర్వహించబడుతున్నది. మరికొన్ని భాషల వికీకోట్‌లు అచేతనంగా ఉండుటచే మూసివేశారు.

వీక్షకుల ప్రకారం చూస్తే అన్ని వికీ ప్రాజెక్టుల మాదిరిగానే ఇందులోనూ ఆంగ్లభాషదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానాలను ఇటాలియన్, స్పానిష్, రష్యన్ భాషలు ఆక్రమిస్తున్నాయి. అయితే పేజీల సంఖ్యలో మాత్రం పోలిష్ భాష ఆంగ్ల భాషను అధికమించడం విశేషం.తెలుగుభాషలో నేటికి 288 పేజీలతో భారతీయ భాషలలో మలయాళం తర్వాత రెండో స్థానంలో ఉంది.

తెవికోట్‌లో ఏమివ్రాయవచ్చు?
తెలుగు వికీకోట్‌లో ప్రముఖుల వ్యాఖ్యలు (కొటేషన్లు), సామెతలు వ్రాయడమే కాకుండా కొందరు ఇదివరకు సినిమా డైలాగులు, పాటలు కూడా వ్రాశారు. ఇది ఇంకనూ ప్రారంభదశలోనే ఉన్నందున పెద్దగా నియమాలు కూడా లేవు. ఒకరిద్దరు మినహా ఇందులో చురుకైన సభ్యులు లేరు. మీకు కొటేషన్లపై ఆసక్తి ఉండి ఇందులో పనిచేయాలంటే ఇప్పుడే తెవికోట్‌లో చేరి రచనలు ప్రారంభించండి.
తెవికోట్ అడ్రస్: https://te.wikiquote.org/

Saturday 2 November 2013

అక్టోబరు 2013 మాసంలో తెవికీలో ఎలాంటి వ్యాసాలు వచ్చాయి?

అక్టోబరు మాసంలో తెవికీలో సభ్యుల దిద్దుబాట్లు బాగానే జరిగాయి. కాని కొత్తగా నాణ్యమైన వ్యాసాలు కొద్ది సంఖ్యలోనే చేరాయి. ఈ మాసంలో కొత్తగా వ్యాసాలు 243 చేరగా అందులో చాలా వరకు చిన్నవ్యాసాలే. ఇందులో 36 మాత్రమే 10వేల బైట్లు పైబడిన వ్యాసాలు. ఈ 36లో అంశాల వారీగా చూస్తే సైన్సుకు సంబంధించిన 16, హిందూమతానికి చెందిన 4, జీవిత చరిత్ర వ్యాసాలు 2, సినిమా వ్యాసాలు 2, ఫోటోగ్రఫి వ్యాసాలు 2, వర్తమాన విషయానికి చెందిన ఒక వ్యాసం (పైలీన్ తుఫాను), ఖగోళ శాస్త్రానికి చెందిన ఒక వ్యాసం, ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యాసం, తెవికీ నిర్వహణకు చెందిన ఒక వ్యాసం, ఇతరాలు 5 వ్యాసాలు కొత్తగా చేరాయి. ఇందులో పిగ్మీ రాటిల్ స్నేక్ వ్యాసం పూర్తిగా ఆంగ్లంలోనే ఉంది. కొన్ని విలీనం చేయాల్సిన వ్యాసాలున్నాయి. కొన్ని వ్యాసాలు నేరుగా పుస్తకం నుంచి తీసుకున్నవి ఉన్నాయి.

ఇదివరకే ఉన్న వ్యాసాలలో సమాచారం విస్తరణ బాగా జరిగిన వ్యాసాలలో తెలంగాణ, కాశీ, థాయిలాండ్, కురుక్షేత్రం, గుర్తించబడని ఎగురుతున్న వస్తువు వ్యాసాలు ముఖ్యమైనవి.

ఈ మాసంలో కొందరు సభ్యులు దిద్దుబాట్లు అధిక సంఖ్యలో చేసిననూ వాటివల్ల తెవికీ వ్యాసాలకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. నవంబరులో నైనా తెవికీ వ్యాస సంపదను వృద్ధిచేయడానికి, వ్యాస నాణ్యతను పెంచడానికి సభ్యులు కృషి చేస్తారని కోరుకుందాం.